ఫామ్ పాండ్ల పనులను వేగవంతం చేయాలి
నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి
జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
కాకతీయ, జనగామ : పంటల సాగుకు నీటి కొరత లేకుండా వర్షపు నీటిని ఒడిసిపట్టి, అవసరమైన సమయంలో పంటలకు వినియోగించుకునేందుకు చేపడుతున్న ఫామ్ పాండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మంగళవారం పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో చేపడుతున్న ఫామ్ పాండ్ల నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫామ్ పాండ్ల నిర్మాణాలకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత లోతు, ఎత్తు, పొడవులతో నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మండలంలో ఐదు ఫామ్ పాండ్లను ఎంపిక చేసి, వాటి నిర్మాణ పనులను అధికారులు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్పష్టం చేశారు. నిర్మాణ పనులకు ప్రతిరోజూ ఎంతమంది కూలీలు హాజరవుతున్నారు, వారికి ఎంతమేర కూలి చెల్లిస్తున్నారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూలీల హాజరును తప్పనిసరిగా నమోదు చేయడంతోపాటు, పనులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. అలాగే, ప్రభుత్వం రైతులకు వ్యవసాయ యాంత్రిక పరికరాలపై అందిస్తున్న సబ్సిడీల గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. నీటి లభ్యతను బట్టి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, ఎంపీడీఓ వేదవతి, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

