గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి
రాహుల్ గాంధీకి డా. పెరుమాండ్ల రామకృష్ణ విజ్ఞప్తి
కాకతీయ, వరంగల్ బ్యూరో : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన డా. పెరుమాండ్ల రామకృష్ణ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన రామకృష్ణ, తన బయోడేటాను అందజేసి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మాదిగ, దళిత, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ సంఘాలతో పాటు ఉద్యోగ, ప్రజా, ఉద్యమకారుల సంఘాలు తనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని కోరుతూ పలు విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్న విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం ముఖ్య నాయకులను కలిసి తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారని వివరించారు. తనకు మద్దతుగా వివిధ సంఘాలు, కార్యకర్తలు చేస్తున్న విజ్ఞప్తులకు సంబంధించిన వివరాలను రాహుల్ గాంధీకి అందజేశారు. తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి డా. పెరుమాండ్ల రామకృష్ణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

