రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలి
డ్రిప్ పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించాలి
జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ప్రధాన కంపెనీల విత్తనాలు, ఎరువుల నిల్వలపై ఆరా
కాకతీయ, జనగామ : రైతులకు వ్యవసాయానికి అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డ్రిప్ పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. బుధవారం పాలకుర్తి మండలం ముత్తారం గ్రామంలోని మహిళా శక్తి రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి అక్కడి సేవలు, వ్యవసాయ ఉత్పాదకాలు, పరికరాలు, విత్తనాల నిల్వలను పరిశీలించారు. రైతులకు అవసరమైన డ్రిప్ పరికరాలు అందుబాటులో ఉన్నాయా, ఇప్పటివరకు ఎంతమందికి పంపిణీ చేశారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్కువ నీటితో సమర్థవంతంగా సాగునీరు అందించేందుకు డ్రిప్ విధానం ఉపయోగకరమని, రైతులకు దీనిపై అవగాహన కల్పించి వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్రధాన కంపెనీలకు చెందిన నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయా, వాటి విక్రయాలు ఎలా జరుగుతున్నాయనే అంశాలను పరిశీలించారు. ఎస్ఎస్పీ, కాంప్లెక్స్ ఎరువుల నిల్వలు, విక్రయాలపై ఆరా తీశారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళా శక్తి రైతు సేవా కేంద్రాలు వ్యవసాయ రంగంలో భాగస్వాములవుతూ రైతులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ పరిశీలనలో డీఏఓ అంబికా సోనీ, ఎంపీడీవో వేదవతి, ఏడీఏ అపర్ణ, ఎంపీఓ మల్లికార్జున, ఎంఏఓ విద్యాసాగర్, ఏఈఓ మహేష్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

