జర్నలిస్టులపై చిత్రహింసల ఘటనపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి
గంభీరావుపేట ఎస్సైని సస్పెండ్ చేయాలి..
కొరిమి వెంకటస్వామి డిమాండ్
కాకతీయ,శంకరపట్నం:జర్నలిస్టులు కొత్తూరు శేఖర్, రాతిపెల్లి సంపత్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్ర చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొరిమి వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. గురువారం శంకరపట్నం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. జర్నలిస్టులపై జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై ఇలాంటి చర్యలకు పాల్పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకొని సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులైన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనకు బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఇతర సంబంధిత పోలీసు అధికారులపైనా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వెంకటస్వామి డిమాండ్ చేశారు. ప్రస్తుతం బాధిత జర్నలిస్టులు ఇద్దరూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయ విచారణకు ఆదేశించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

