అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
ఏటూరునాగారం ఎక్సైజ్ వేలంలో ఇష్టారాజ్యం
వేలం వేళ మూడు ముక్కలంటూ.. తీరా రెండు ముక్కలతోనే సరి
35 వాహనాల్లో 32 చాయిస్ నంబర్లు..
ఎక్సైజ్ వేలంలో అధికారుల తీరుపై అనుమానాలు
సీఐ సమాధానంపై వినియోగదారుల ఆగ్రహం
ఉన్నతాధికారులు స్పందించేనా
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ఏటూరునాగారం ఎక్సైజ్ శాఖ నిర్వహించిన ద్విచక్ర వాహనాల స్క్రాప్ వేలం వ్యవహారం వివాదాస్పదంగా మారింది. వేలం సమయంలో ఒక విధంగా నిబంధనలు చెప్పి, వాహనాలను అప్పగించే సమయంలో మరో విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 24న నిర్వహించిన వేలంలో వాహనాలను మూడు ముక్కలుగా చేయాల్సి ఉంటుందని చెప్పడంతో పలువురు వెనుదిరిగారని వినియోగదారులు చెబుతున్నారు. అయితే అక్టోబర్ 15న వాహనాలను రెండు ముక్కలుగానే స్క్రాప్ చేసి అప్పగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యత్యాసంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
వేలం సమయంలో మూడు ముక్కలుగా చేయాలనే షరతు చెప్పడంతో తాము పాటలో పాల్గొనలేదని పలువురు వినియోగదారులు పేర్కొంటున్నారు. రెండు ముక్కలుగానే స్క్రాప్ చేసి అప్పగిస్తారని ముందే తెలిసి ఉంటే తాము కూడా వేలంలో పాల్గొనేవారమని అంటున్నారు. వేలంలో ప్రకటించిన నిబంధనలకు, వాహనాల అప్పగింతలో అనుసరిస్తున్న విధానానికి మధ్య తేడా ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. వేలం నోటీసులో పేర్కొన్న షరతులు, వాహనాలను ధ్వంసం చేసే విధానం, అప్పగింత రికార్డులను పరిశీలిస్తేనే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


35 వాహనాలు.. 32 చాయిస్ నంబర్లు!
వేలంలో ఉన్న 35 ద్విచక్ర వాహనాల్లో 32 వాహనాలకు చాయిస్ నంబర్లు ఉన్నట్లు వెల్లడవడం మరో చర్చకు దారితీసింది. దీనిపై ప్రశ్నించగా, వాహనాలను స్వాధీనం చేసుకున్నప్పుడే వాటికి చాయిస్ నంబర్లు లేవని, ఇప్పుడు తామేమీ చేయలేమని అధికారులు చెప్పినట్లు సమాచారం. అయితే స్వాధీనం సమయంలో నమోదు చేసిన వివరాలు ఏమిటి? కేసుల రికార్డుల్లో వాహనాల గుర్తింపు వివరాలు ఎలా ఉన్నాయి? వేలానికి ముందు వాటిని పరిశీలించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఛాసిస్, ఇంజిన్ నంబర్లు, స్వాధీన పంచనామాలు, వేలం జాబితాలను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.
గతంలోనూ ఇదే విధానమా?
గతంలో స్క్రాప్ పేరుతో వేలం వేసిన కొన్ని ద్విచక్ర వాహనాలను తిరిగి రోడ్లపై వినియోగిస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు నిర్ధారణ కావాల్సి ఉంది. స్క్రాప్ చేసిన వాహనాలు తిరిగి వినియోగంలోకి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రస్తుత వేలానికి వర్తించే అధికారిక నిబంధనలు ఏమిటి? అన్న అంశాలను రికార్డుల ఆధారంగా పరిశీలించాల్సి ఉంది. ఈ వ్యవహారంపై ఎక్సైజ్ సీఐని వివరణ కోరగా, గతంలో ఏ విధంగా చేశామో ఇప్పుడూ అలాగే చేస్తున్నామని చెప్పినట్లు తెలిసింది. అయితే ఈ సమాధానం తమ సందేహాలను నివృత్తి చేయలేదని వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేలం సమయంలో ప్రకటించిన షరతులు, వాహనాల అప్పగింత విధానం, చాయిస్ నంబర్ల వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కోరుతున్నారు. ఆరోపణల్లో వాస్తవం ఉంటే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, లేదంటే అధికారిక రికార్డులతో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏటూరునాగారం ఎక్సైజ్ వేలం వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందిస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

