రైతుల సమస్యలపై సీతక్క నిర్లక్ష్యం.. తాడ్వాయి సర్పంచ్‌కు అవమానం
విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు
సర్పంచ్ పట్ల వివక్ష చూపుతున్నారంటూ బీఆర్ఎస్ నేత విమర్శలు
కాకతీయ, ములుగు : జిల్లాలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ పంటలు ఎండిపోతున్నా మంత్రి సీతక్క పట్టించుకోవడం లేదని మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. శనివారం తాడ్వాయి మండలం మేడారంలో బీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు దండుగుల మల్లయ్య నివాసంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాడ్వాయి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఫంక్షన్ హాల్‌ను సమీపంలోని కామారం పంచాయతీకి బదిలీ చేయడం, స్థానిక సర్పంచ్ కొట్టెం ప్రవళికను ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం వివక్షాపూరిత వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌కు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వకుండా అవమానించడం సరికాదన్నారు. సర్పంచ్ భర్తను అరెస్టు చేయడాన్ని కూడా తప్పుబడుతూ ప్రజాప్రతినిధుల పట్ల ఇలాంటి వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, స్థానిక ప్రజాప్రతినిధుల పట్ల వివక్ష లేకుండా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

