అర్హులైన పేదలకు న్యాయం చేయాలి
ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు
ఓదెల మండల గ్రామాల కమిటీ సభ్యులతో సమీక్ష
కాకతీయ, ఓదెల: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టి, అర్హులైన పేదలకు న్యాయం చేయాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. శుక్రవారం ఓదెల మండలం రూపునారాయణపేటలోని తన నివాసంలో మండలంలోని పలు గ్రామాల ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులతో లబ్ధిదారుల ఎంపికపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, అర్హులకు ప్రభుత్వ పథకం అందేలా కమిటీ సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని సూచనలు చేశారు. ఎంపిక ప్రక్రియలో అర్హతలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

