అనుమతులు లేకుండా టపాసుల నిల్వ
రూ.4.22 లక్షల సరుకు స్వాధీనం
నివాస గృహంలో భారీగా బాణసంచా నిల్వ
టాస్క్‌ఫోర్స్ దాడిలో వెలుగులోకి అక్రమ నిల్వ
హసన్‌పర్తి టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో వ్యాపారి కత్తి రంజిత్
కాకతీయ, హసన్‌పర్తి : అనుమతులు లేకుండా నివాస గృహంలో భారీగా బాణసంచా నిల్వ చేసిన వ్యాపారిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి రూ.4,22,067 విలువైన టపాసులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు అక్టోబర్ 19న హసన్‌పర్తి మండలం నాగారం గ్రామంలోని కత్తి రంజిత్ (38) ఇంటిపై టాస్క్‌ఫోర్స్ బృందం దాడి చేసింది. నివాస ప్రాంతంలోని ఇంట్లో సంబంధిత అధికారుల నుంచి అనుమతులు, లైసెన్స్ పొందకుండా, అవసరమైన భద్రతా చర్యలు తీసుకోకుండా వివిధ రకాల బాణసంచా నిల్వ చేసినట్లు గుర్తించారు. తనిఖీల్లో రాకెట్లు, పూల కుండీలు, చక్రాలు, తారాజువ్వలు, మల్టీషాట్ టపాసులు, బాంబులు సహా పలు రకాల బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 130 ప్యాకెట్ల క్యాట్ బాంబుల విలువ రూ.76,700గా ఉంది. మొత్తం స్వాధీనం చేసుకున్న బాణసంచా విలువ రూ.4,22,067గా పోలీసులు వెల్లడించారు. అనంతరం నిందితుడు కత్తి రంజిత్‌తో పాటు స్వాధీనం చేసుకున్న బాణసంచాను తదుపరి చర్యల నిమిత్తం హసన్‌పర్తి పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో ఏసీపీ ఏ. మధుసూధన్, ఇన్‌స్పెక్టర్ వి. క్రాంతికుమార్, ఎస్సైలు కె. సుధాకర్, బి. ఉప్పలయ్య, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

