మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి
బాలికల గురుకులంలో ప్రత్యేకాధికారి అనురాధ ఆకస్మిక తనిఖీలు
ఆహార నాణ్యత, పరిశుభ్రత, వసతులపై ఆరా
కాకతీయ, హసన్పర్తి: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు కల్పించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రత్యేక అధికారి, వ్యవసాయ అధికారి ఎ. అనురాధ సూచించారు. శనివారం హసన్పర్తి మండలంలోని టీజీఎస్డబ్ల్యూఆర్డీసీ (డబ్ల్యూ) భూపాలపల్లి బాలికల గురుకుల వసతి గృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, ఆహార నిల్వ గది, వంట సామగ్రి, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజనం నాణ్యత తెలుసుకునేందుకు వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి సౌకర్యాలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, వంటగది, భోజనశాల, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఆదేశించారు.

