చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించాలి
పెండింగ్ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలి
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
కాకతీయ, భూపాలపల్లి : రోడ్డు విస్తరణలో భాగంగా ఎన్నో ఏళ్లుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న పేదల దుకాణాలను ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలకు ఎవరూ వ్యతిరేకం కాదని, అయితే అభివృద్ధి పేరుతో పేద చిరు వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీయడం సరికాదన్నారు. కూరగాయలు, పండ్లు, చికెన్ సెంటర్లు, టీ స్టాల్స్, సెలూన్లు తదితర వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ప్రత్యామ్నాయ స్థలాలు కల్పించి, జీవనోపాధికి భరోసా ఇచ్చిన తర్వాతే తొలగింపు చర్యలు చేపట్టాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పట్టణ అభివృద్ధిలో భాగంగా టెండర్లు పిలిచి ప్రారంభించిన అనేక పనులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నా ఆ పనులను ఎందుకు నిలిపివేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, సంబంధిత మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో భూపాలపల్లి పట్టణంలోని పేదల కోసం సుమారు 1,000 డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించగా, అందులో సుమారు 500 ఇళ్లను తమ హయాంలోనే పేద కుటుంబాలకు అందించామని గండ్ర తెలిపారు. 4 సంవత్సరాలుగా ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలను విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. ఇళ్లను ఆసరాగా చేసుకుని మధ్యవర్తులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పేదలను ఇబ్బందులకు గురిచేసే చర్యలను నిలిపివేసి, వారి జీవనోపాధికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.

