ఉద్యమంలో కనకం నాగయ్య కీలక పాత్ర
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
కాకతీయ, శంకరపట్నం: తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన కనకం నాగయ్య మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో ముత్తారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహించిన ఉద్యమంలో నాగయ్య చురుకుగా పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. 2011లో శంకరపట్నం మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఆందోళనలో పాల్గొన్న ఆయనపై పోలీస్ కేసు నమోదైంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నాగయ్య ప్రజా సేవలో తనదైన ముద్ర వేశారు. ఆయన భార్య వసంతను తాడికల్ సహకార సంఘం డైరెక్టర్‌గా, ముత్తారం-కన్నాపూర్ ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిపించడంలో కీలకంగా వ్యవహరించారు. మండలంలో ‘టీఆర్‌ఎస్ నాగయ్య’గా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయనకు భార్య వసంతతో పాటు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. బుధవారం నిర్వహించిన నాగయ్య అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. నాగయ్య పాడెను మోసి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. నాగయ్య మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

