వేతన కోతతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆందోళన
జీఓ 1181ను నిలిపివేయాలని జిడబ్ల్యూ ఎంసి కమిషనర్ కు వినతి
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీఓ ఆర్టీ 1181 వేతన కోత రూపంలో గుదిబండగా మారింది. ప్రస్తుత హోదాలు, వేతనాలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ కార్మిక సంఘాల నేతలు సోమవారం బల్దియా గ్రీవెన్స్ లో కమిషనర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్లు, శానిటరీ, ఎలక్ట్రికల్, హార్టికల్చర్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్, డిఆర్ఎఫ్, కెమిస్టులు, హెల్పర్లుగా 20-25 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర కేటగిరీలకు మార్చడం వల్ల వేతనాలు తగ్గుతున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కంప్యూటర్ ఆపరేటర్లను డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా చూపడంతో హోదాకే ఎసరు వస్తోందన్నారు.
పే ప్రొటెక్షన్ కల్పించాలి
గతంలోని జీఓఎంఎస్ నం.14, 60, 63 ప్రకారం వేతన విధానాన్ని కొనసాగించాలని, జీఓ ఆర్టీ 1037 ద్వారా ఇచ్చిన వేతన రక్షణను వర్తింపజేయాలని కోరారు. తాజా జీఓ 1181తో వేతన కోత పడితే నిత్యావసర ధరలు, పిల్లల చదువులు, వైద్యం, ఇంటి అద్దెలతో కుటుంబాలు గడవడం కష్టమని వాపోయారు. పారిశుధ్యం, నీటి సరఫరా, ఇంజనీరింగ్, రెవెన్యూ తదితర విభాగాల్లో నిరంతరం సేవలందిస్తున్న తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వంపై అదనపు భారం కోరడం లేదని, ప్రస్తుత వేతనాలకే పే ప్రొటెక్షన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టిజిఎంసిఓ, ఐఎన్ టియుసి, ఏఐటియుసి, సిఐటియు, ఎంఆర్ పిఎస్, బిఆర్ టియు , జేఏసి, టిఎంబికె నాయకులు పాల్గొన్నారు.

