7వ వార్డులో అభివృద్ధి పనులకు వేగం
15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు సమస్యకు పరిష్కారం
కాలువల పరిశుభ్రత, చెట్ల తొలగింపునకు ప్రత్యేక చర్యలు
వార్డు సభ్యుడు మాదరి మధు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ములుగు జిల్లా ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని 7వ వార్డులో అభివృద్ధి, పారిశుధ్య పనులకు వేగం పెరిగింది. సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్‌బాబు ఆదేశాల మేరకు వార్డు సభ్యుడు మాదరి మధు ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. సుమారు 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు సమస్యకు పరిష్కారం చూపేందుకు నిర్మాణ పనులు ప్రారంభించారు. రోడ్లు లేని ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణంతోపాటు ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాలువల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తను తొలగిస్తూ దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. వార్డులో చెత్తాచెదారం పేరుకుపోకుండా పారిశుధ్య పనులు కొనసాగిస్తున్నారు. రామన్నగూడెం రోడ్డుపై ప్రమాదకరంగా మారిన ఎండిన చెట్లను, విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించారు. రైతులు ధాన్యం బస్తాలను తరలించే సమయంలో ఇబ్బందులు లేకుండా అవసరమైన ప్రాంతాల్లో చెట్ల తొలగింపు చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లే మార్గంలో మాన్హోల్ కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టారు.

