మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పేదింటి ఆడబిడ్డలకు అండ
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
కాకతీయ, పెద్దవంగర: ప్రజా పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం పాలకుర్తి నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో పెద్దవంగర మండలానికి చెందిన 64 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలని సూచించారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయని తెలిపారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేని వారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రంగు మురళిగౌడ్, మాజీ అధ్యక్షుడు ముద్దసాని సురేష్, నాయకులు సంకెపల్లి రవీందర్‌రెడ్డి, సైదులు, హరికృష్ణ, శ్రీనివాస్, మహేష్, వేణు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

