బోగస్ ఫారం–7లపై కొరడా
తప్పుడు దరఖాస్తులతో ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తే చర్యలు
క్షుణ్ణంగా విచారించిన తర్వాతే ఓటు తొలగింపు
ముషీరాబాద్, గోషామహల్, బహదూర్‌పురాలో వెలుగులోకి వచ్చిన వ్యవహారం
ఇప్పటికే 29 వేల ఫారం–7 దరఖాస్తులు
ప్రీ–ఫిల్‌డ్ ఫారం–7లపై సీఈవో సుదర్శరెడ్డి సీరియస్
జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్లకు సీఈవో సుదర్శన్‌రెడ్డి ఆదేశాలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు తప్పుడు సమాచారంతో ఫారం–7 దరఖాస్తులు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో ఎవరి ఓటు తొలగించాలో ముందే వివరాలు ముద్రించిన ఫారం–7లను భారీగా సమర్పిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎన్నికల యంత్రాంగం అప్రమత్తమైంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం, తప్పుడు ప్రకటనలతో ఫారం–7 దరఖాస్తులు సమర్పిస్తే చట్ట ప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఫారం–7తోపాటు కొత్త ఓటు నమోదు కోసం ఉపయోగించే ఫారం–6, ఇతర దరఖాస్తుల్లోనూ ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభ్యంతరాలు, క్లెయిమ్‌ల గడువు ఎల్లుండితో ముగియనున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ముందే ముద్రించిన ఫారం–7లు
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎవరి పేర్లు తొలగించాలో వివరాలు ముందుగానే ముద్రించిన ఫారం–7లు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నట్లు ఎన్నికల అధికారుల దృష్టికి వచ్చింది. సాధారణంగా ఒక ఓటరు అనర్హుడని భావించినప్పుడు, ఆ ఓటు నకిలీ లేదా డూప్లికేట్ అని అనుమానం ఉన్నప్పుడు, ఓటరు మరణించినప్పుడు, సంబంధిత చిరునామాలో నివసించనప్పుడు ఓటు తొలగించాలని అభ్యంతరం వ్యక్తం చేసేందుకు ఫారం–7ను ఉపయోగిస్తారు. అయితే సంబంధిత ఓటరు వివరాలను ముందుగానే ముద్రించి, ఫారాలను కట్టలుగా సమర్పిస్తున్న ఘటనలు వెలుగులోకి రావడంతో వాటి వెనుక ఎవరు ఉన్నారనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మూడు నియోజకవర్గాల్లో కలకలం
హైదరాబాద్ పరిధిలోని ముషీరాబాద్, బహదూర్‌పురా, గోషామహల్ నియోజకవర్గాల్లో ప్రీ–ఫిల్‌డ్ ఫారం–7లు కనిపించినట్లు సమాచారం. ముషీరాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ పరిధిలో ఇలాంటి పత్రాలు లభించాయని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల విభాగం నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం బహదూర్‌పురా నియోజకవర్గంలోనూ ముందే ముద్రించిన ఫారం–7లు కనిపించగా.. శనివారం గోషామహల్‌లోనూ ఇదే తరహా పత్రాలు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ ఫారాలను ఎవరు తయారు చేస్తున్నారు? ఎక్కడ ముద్రిస్తున్నారు? బూత్ స్థాయి అధికారులకు ఎవరు అందజేస్తున్నారు? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
29 వేల దరఖాస్తులపై దృష్టి
తెలంగాణలో ఇప్పటివరకు ఫలానా ఓటర్ల పేర్లు తొలగించాలని కోరుతూ ఎన్నికల అధికారులకు దాదాపు 29 వేల ఫారం–7 దరఖాస్తులు అందినట్లు సమాచారం. వీటిలో తప్పుడు వివరాలతో సమర్పించిన దరఖాస్తులు ఏమైనా ఉన్నాయా? ముందుగానే ఓటర్ల వివరాలు ముద్రించి సమర్పించిన ఫారాలు ఎన్ని? అనే అంశాలను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముషీరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు ఎన్నికల యంత్రాంగం తెలిపింది. ప్రీ–ఫిల్‌డ్ ఫారం–7లను గుర్తించిన బూత్ స్థాయి అధికారులు వాటిని స్వీకరించకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందని ఎన్నికల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఓటు తొలగింపునకు ముందు విచారణ
ఒక వ్యక్తి ఓటును తొలగించే ముందు ఫారం–7లో పేర్కొన్న కారణం నిజమా కాదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించాలని సీఈవో సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత ఓటరు నిజంగా అక్కడ నివసిస్తున్నారా? మరణించిన వ్యక్తి పేరేనా? ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నాయా? ఇచ్చిన చిరునామా సరైనదేనా? వంటి అంశాలను నిర్ధారించిన తర్వాతే తొలగింపు ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి నిజమైన ఓటరును జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తే చట్ట ప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా కొత్త ఓటు కోసం సమర్పించే ఫారం–6, ఇతర దరఖాస్తుల్లోనూ తప్పుడు సమాచారం లేదా తప్పుడు ప్రకటనలు ఇస్తే బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎవరి పేర్లు తొలగించాలో పేర్కొంటూ ముందే ముద్రించిన ఫారం–7లు లభిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల విభాగం సీఈవో సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. ముషీరాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ పరిధిలో ఇలాంటి పత్రాలు లభించాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకే విధానంలో మూడు నియోజకవర్గాల్లో పత్రాలు కనిపించడం వెనుక సమన్వయంతో వ్యవహారం జరుగుతోందా? అనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అసలు మూలాలను గుర్తించాలని కోరారు.
పోలీసులకు టీపీసీసీ ఫిర్యాదు
నిజమైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు ప్రీ–ఫిల్‌డ్ ఫారం–7లను ఉపయోగిస్తున్నారంటూ టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కూడా హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్‌కుమార్, సభ్యులు సమర్పించిన ఫిర్యాదులో ముషీరాబాద్, బహదూర్‌పురా, గోషామహల్ నియోజకవర్గాల్లో ఒకే తరహా ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఫారం–7లను ఎవరు తయారు చేశారు? ఎక్కడ ముద్రించారు? ఎవరు పంపిణీ చేశారు? ఓటర్ల వ్యక్తిగత ఎన్నికల సమాచారాన్ని ఎక్కడి నుంచి సేకరించారు? అనే అంశాలపై దర్యాప్తు చేయాలని కోరారు. ఈ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం పాత్రపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు నిజమని తేలితే రాజకీయ హోదాతో సంబంధం లేకుండా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు ఫారం–7లపై అందుతున్న దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించిన తర్వాతే ఓట్ల తొలగింపు చేపట్టాలని సీఈవో ఆదేశించడంతో.. వచ్చే రోజుల్లో ఈ వ్యవహారంపై ఎన్నికల యంత్రాంగం చేపట్టే విచారణ కీలకంగా మారింది.

