బతుకమ్మ, దసరా వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ
వరంగల్ ప్రతినిధి : బతుకమ్మ నవరాత్రులు, విజయదశమి ఉత్సవాలను వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉర్సు రంగలీల మైదానంలో జరిగిన ఏర్పాట్ల సమీక్షలో పోలీస్ కమిషనర్ శ్వేత, కలెక్టర్ డా సత్య శారద, బల్దియా కమిషనర్ టి వెంకన్న, ఉత్సవ కమిటీ సభ్యులతో ఆమె సమావేశమయ్యారు.

ప్రత్యేక దృష్టి పెట్టండి :
మహిళలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, మొబైల్ టాయిలెట్ల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతిరోజూ కార్యక్రమం ముగిసిన వెంటనే వ్యర్థాలను తొలగించాలని, ప్రధాన రహదారుల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
విజయదశమి రోజున 5 నుండి 6 వేల మంది వస్తారని, భద్రత, ట్రాఫిక్, అగ్నిమాపక ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలన్నారు.
చిన్నారులకు ట్యాగ్ లు :
ఉత్సవాల్లో చిన్నారులు తప్పిపోకుండా తల్లిదండ్రుల ఫోన్ నంబర్ తో కూడిన ఫ్రెండ్ షిప్ బ్యాండ్ లాంటి ట్యాగ్ లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్య శారద సూచించారు. సౌండ్ నియంత్రణ నిబంధనలు పాటించాలని, హెల్త్ క్యాంప్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
పోలీస్ కమిషనర్ శ్వేత మాట్లాడుతూ ట్రాఫిక్ డైవర్షన్, జామ్ నియంత్రణకు పోలీసు యంత్రాంగం సహకరిస్తుందన్నారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, వై.వి.గణేష్, సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు గోపాల్, అధ్యక్షుడు సంజయ్ బాబు, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

