నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మహాజ్యోతి పూజ
కాకతీయ, గీసుగొండ: ప్రసిద్ధ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మహాజ్యోతి పూజను ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో కొలువుదీరిన శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పూలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. మాలధారణ స్వీకరించిన స్వాముల భజనల నడుమ మహాజ్యోతి పూజ నిర్వహించి 12 జ్యోతులతో స్వామివారికి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు రుణ విమోచన సంఘం మాజీ అధ్యక్షుడు నాగూర్ల వెంకటేశ్వర్లు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పరకాల సీఐ ప్రవీణ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు, కోశాధికారి కొత్తగట్టు రాజేందర్, గ్రామ సర్పంచ్ కక్కర్ల సుభాష్, కమిటీ సభ్యులు, మండల దీక్షలు చేపట్టిన స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

