బతుకమ్మ, దసరా వేడుకలకు ముందస్తు ఏర్పాట్లు చేయండి
జిడబ్ల్యుఎంసి కమిషనర్ వెంకన్న
భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : అక్టోబర్ 10 నుండి ప్రారంభం కానున్న బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పకడ్బందీగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిడబ్ల్యుఎంసి కమిషనర్ టి వెంకన్న అధికారులను ఆదేశించారు.
బుధవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు.
66 డివిజన్లలో ప్రత్యేక ఏర్పాట్లు
జిడబ్ల్యూఎంసి పరిధిలోని 66 డివిజన్లలో బతుకమ్మ వేడుకలు జరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని సూచించారు. ఈ నెల 18న సద్దుల బతుకమ్మ, 20న దసరా వేడుకలు జరిగే పద్మాక్షి, భద్రకాళి, వేయి స్తంభాల గుడి, గుండుచెరువు, బంధం చెరువు, పెద్దచెరువు, హసన్ పర్తి, ఉర్సు గుట్ట, రంగసాయిపేట, శివనగర్, తోట మైదాన్, చిన్నవడ్డేపల్లి, కాశిబుగ్గ తదితర ప్రాంతాల్లో రద్దీకి అనుగుణంగా సదుపాయాలు కల్పించాలన్నారు.
పారిశుద్ధ్యం, లైటింగ్ పై ఫోకస్
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఫాగింగ్, శానిటేషన్ స్ప్రేయింగ్ చేపట్టాలని, అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సద్దుల బతుకమ్మ రోజున నిమజ్జన ప్రాంతాల్లో పూలు, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు.భక్తుల సౌకర్యార్థం వీధి దీపాల మరమ్మతులు, హైమాస్ట్ లైట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీరు, పార్కింగ్ వసతులు కల్పించాలని సూచించారు. గుర్రపు డెక్కను తొలగించి ప్రధాన ప్రాంతాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు.
సమావేశంలో ఎస్ఈ రాజ్ కుమార్, ఎంహెచ్ఓ డా రాజేష్, డిఎఫ్ఓ శంకర్ లింగం, ఎస్ఎఫ్ఓ రాజేశ్వరరావు, ఈఈలు రవికుమార్, సంజయ్ కుమార్, మహేందర్, ఎంటమాలజిస్ట్ రజని తదితరులు పాల్గొన్నారు.

