బాధిత కుటుంబాలకు భరోసా
మృతుల కుటుంబాలకు పార్టీ, వ్యక్తిగతంగా అండగా ఉంటా
కుటుంబ పెద్దలను కోల్పోవడం బాధాకరం.. ధైర్యంగా ఉండాలి
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి
కాకతీయ, రాయపర్తి : ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలకు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి భరోసా కల్పించారు. గురువారం రాయపర్తి మండలంలో పర్యటించిన ఆమె కాట్రపల్లి గ్రామానికి చెందిన కుందూరు వెంకట్రెడ్డి కుటుంబాన్ని, అనంతరం కృష్ణాపురం గ్రామానికి చెందిన ఎస్సై వీరన్న కుటుంబాన్ని పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.. రెండు కుటుంబాలు ఇంటి యజమానులను కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఎలాంటి కష్టం వచ్చినా పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఇరు కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్రెడ్డి, మాజీ బ్లాక్ అధ్యక్షుడు హామ్యా నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

