బాలల స్నేహపూర్వక నగరంగా వరంగల్
జీడబ్ల్యూఎంసీలో ‘నర్చరింగ్ నెయిబర్ హుడ్స్-2.0’ వర్క్ షాప్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : చిన్నారులు, కుటుంబాలకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి వరంగల్ ను బాలల స్నేహపూర్వక నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అన్నారు. గురువారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో డబ్ల్యూఆర్ఐ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నర్చరింగ్ నెయిబర్ హుడ్స్-2.0’ సిటీ లెవల్ వర్క్ షాప్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునేలా, తల్లిదండ్రులు ప్రశాంతంగా సమయం గడిపేలా నగరంలోని ప్రజా ప్రదేశాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్కులు కేవలం వినోదానికి పరిమితం కాకుండా చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి దోహదపడేలా ఉండాలని సూచించారు.

20 ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి
నగరంలో ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించి వాటిని పార్కులు, ఆట స్థలాలుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే 20 ప్రాంతాల్లో పార్కులు, పైప్ లైన్ తదితర మౌలిక సదుపాయాల పనులు చేపట్టామని, ఇదే స్ఫూర్తితో మరిన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
0-5 ఏళ్ల పిల్లలకు ప్రత్యేక ఆట స్థలాలు
0-5 సంవత్సరాల పిల్లలకు సురక్షితమైన ఆట స్థలాల రూపకల్పన, ప్లేగ్రౌండ్ సేఫ్టీ మార్గదర్శకాల అమలు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు శిక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టామని వర్క్ షాప్ లో వివరించారు. బాలసముద్రం, క్రిస్టియన్ కాలనీ తదితర ప్రాంతాల్లో పిల్లలకు అనుకూలమైన ఆట స్థలాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
2020-2026 మధ్య చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు శానిటేషన్, ఇంజనీరింగ్, హార్టికల్చర్ విభాగాల నుండి పూర్తి సహకారం అందిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, డబ్ల్యూఆర్ఐ ప్రోగ్రామ్ మేనేజర్ అరుణిమా సేన్, సీనియర్ ప్రోగ్రామ్ అసోసియేట్స్ శబ్నా సీమాము, సుఫియాన్ ఖాజీ, సీహెచ్ వో లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, హార్టికల్చర్ ఆఫీసర్ ప్రశాంత్, ఈఈ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

