‘ఓం నమో సుబ్రహ్మణ్యం’ నామస్మరణ
భక్తిపారవశ్యంలో మునిగిన మండల దీక్ష స్వాములు
నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి పంచామృత అభిషేకాలు
రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు ప్రత్యేక పూజలు
కాకతీయ, గీసుగొండ: ఊకల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ‘ఓం నమో సుబ్రహ్మణ్యం’ ఏకనామ స్మరణతో మార్మోగింది. గీసుగొండ మండలం ఊకల్ హవేలీ గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం మండల దీక్ష చేపట్టిన స్వాములు భక్తిపారవశ్యంలో నామస్మరణ చేశారు. ఉదయాన్నే స్వామివారికి పంచామృత అభిషేకాలు, చతుర్వేద పారాయణం నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. మండల దీక్ష చేపట్టిన 100 మంది స్వాములు రోజంతా ఏకనామ స్మరణలో పాల్గొంటారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు తన ధర్మపత్ని సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంభువుగా వెలసి, వల్మీకమే గర్భాలయంగా విరాజిల్లుతున్న ఆలయ విశిష్టతను తెలుసుకున్న దంపతులు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు సముద్రాల సుదర్శనాచార్యులు ఆలయ సంప్రదాయాల ప్రకారం కమిషనర్ దంపతులకు స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. అనంతరం వేదాశీర్వచనం అందించి స్వామివారి శేషవస్త్రాలను బహూకరించారు. ఆలయ విశేషాలను వివరించగా, స్వామివారి అలంకరణను తిలకించిన కమిషనర్ అర్చకులను అభినందించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు, కమిటీ సభ్యులు, ఆలయ బాధ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

