విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు
ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పెరగనున్న విద్యుత్ డిమాండ్
నిరంతర సరఫరాకు విద్యుత్ శాఖ ముందస్తు కసరత్తు
టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి
ములుగు సర్కిల్లో సబ్స్టేషన్ల నిర్వహణపై సీఎండీ సమీక్ష
కాకతీయ, ములుగు: ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, వ్యవసాయ అవసరాలతోపాటు ఏసీలు, కూలర్ల వినియోగం అధికం కావడంతో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం ములుగు సర్కిల్ పరిధిలోని కమలాపూర్ 132/33 కేవీ సబ్‌స్టేషన్‌తోపాటు మంగపేట, మల్లూరు, అబ్బాపూర్ 33/11 కేవీ సబ్స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. నిర్వహణ, పరికరాల పనితీరు, విద్యుత్ సరఫరా పరిస్థితులను సమీక్షించారు. అనంతరం ములుగులోని ఎస్పీఎం షెడ్‌ను పరిశీలించారు. విద్యుత్‌కు గరిష్ఠ డిమాండ్ ఉండే సమయాల్లో అంతరాయాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాధ్యమైన చోట లైన్ క్లియరెన్స్ పనులను సాయంత్రం వేళల్లోనే ప్రణాళికాబద్ధంగా చేపట్టాలన్నారు. 11 కేవీ ఫీడర్లలో లోపాలు తలెత్తితే సిబ్బంది వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని, అనవసరంగా లైన్ క్లియరెన్స్‌లు తీసుకోవద్దని స్పష్టం చేశారు. దెబ్బతిన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను (డీటీఆర్) తక్షణమే మార్చి, విద్యుత్ అంతరాయాలతో రైతుల పంటలకు నష్టం కలగకుండా చూడాలని ఆదేశించారు. గృహ, వాణిజ్య, వ్యవసాయ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో ములుగు సర్కిల్ ఎస్ఈ బిక్షపతి, ములుగు డీఈ రాజు, ఏటూరునాగారం ఏడీఈ, ఇతర విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

