రైతుల సంక్షేమం.. అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం!
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.. రూ.వెయ్యి కోట్లతో వేములవాడ అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కాకతీయ,చందుర్తి: రైతుల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రైతును రాజుగా చూడటమే కాకుండా రారాజుగా నిలబెట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. గురువారం చందుర్తి, సనుగుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నూతన అధ్యక్షులు గసికంటి ప్రభాకర్, ఎగోలం శ్రీనివాస్, కార్యవర్గ సభ్యుల అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

రైతులకు రుణమాఫీ.. సన్న వడ్లకు బోనస్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని ఆది శ్రీనివాస్ తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.20,650 కోట్లతో సుమారు 25.28 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ ప్రయోజనం కల్పించినట్లు వివరించారు. సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ప్రకటించడంతో పాటు, కనీస మద్దతు ధరతో పంటల కొనుగోలు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు.

కళికోట సురమ్మ ప్రాజెక్టుకు రూ.80 కోట్లు
వేములవాడ నియోజకవర్గంలో సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కళికోట సురమ్మ ప్రాజెక్టు పనులను సుమారు రూ.80 కోట్ల నిధులతో చేపడుతున్నామని, ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 48 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని వెల్లడించారు. చెరువులకు నీటి సరఫరా, ఎత్తిపోతల పథకాల అభివృద్ధి, భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రైతులకు సాగునీరు అందినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని అన్నారు.

వేములవాడలో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు
నియోజకవర్గంలో గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఊపునిచ్చిందని ఆది శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. విద్య, వైద్యం, సాగునీరు, రహదారులు, వంతెనలు, విద్యుత్ రంగాల్లో పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. రుద్రంగి ప్రాంతంలో వ్యవసాయ సదుపాయాల మెరుగుదలతో పాటు యువతకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, వేములవాడకు మరింత గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజాసేవే నా లక్ష్యం
ఎమ్మెల్యే పదవిని హోదాగా కాకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తున్నానని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. 1995లో ప్రారంభమైన తన రాజకీయ ప్రస్థానంలో జెడ్పీటీసీ సభ్యుడిగా సహా వివిధ ప్రజాప్రతినిధి బాధ్యతలు నిర్వహించానని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున పోరాడిన సమస్యలను ఇప్పుడు అధికారంలో ఉండి పరిష్కరించే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు రైతుల సమస్యల పరిష్కారంలో చురుగ్గా వ్యవహరించాలని ఆది శ్రీనివాస్ సూచించారు. గ్రామాల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా చూడాలని, పంటల కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.
పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. రైతుల సంక్షేమం, ప్రజల సమస్యల పరిష్కారం, వేములవాడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.

