బతుకమ్మ వేళ 109 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు
మంత్రి సీతక్క చేతుల మీదుగా మంజూరు పత్రాల పంపిణీ రూ.5.45 కోట్లతో 13 గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు
కాకతీయ, ములుగు : పేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం గోవిందరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి 13 గ్రామాలకు చెందిన 109 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.5.45 కోట్లతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. బతుకమ్మ పండుగ వేళ మంజూరు పత్రాలు అందజేయడం సంతోషంగా ఉందని వచ్చే ఏడాది లబ్ధిదారులు తమ సొంతింట్లోనే బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

పారదర్శకంగా ఎంపిక.. అర్హులకు మరో అవకాశం..
ములుగు నియోజకవర్గంలో మొదటి విడతలో సుమారు ఐదు వేల ఇళ్లను మంజూరు చేశామని, రెండో విడతలోనూ అర్హులకు అవకాశం కల్పిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రస్తుత విడతలో ఇళ్లు రాని అర్హులు ఆందోళన చెందవద్దని తదుపరి విడతల్లో అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. లబ్ధిదారులు ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకొని ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని, పునాది స్థాయి పూర్తయిన తర్వాత బిల్లుల చెల్లింపులు ప్రారంభమవుతాయని వివరించారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రారంభ నిర్మాణ ఖర్చుల కోసం సంఘాల ద్వారా రూ.లక్ష రుణం పొందే అవకాశం ఉందన్నారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుకను నిబంధనల ప్రకారం అందుబాటులో ఉంచేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, సర్పంచులు లబ్ధిదారులకు సహకరించాలని సూచించారు.
సంక్షేమ పథకాల అమలు.. ప్రజలకు అండగా ప్రభుత్వం
ఉచిత విద్యుత్, రేషన్ బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలతో ప్రజా ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని మంత్రి తెలిపారు. కొత్త పింఛన్ల కోసం స్వీకరించిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేసి తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో వంద రోజుల పనులను విస్తృతంగా కల్పించి, పని పరిమాణాన్ని బట్టి రోజుకు సుమారు రూ.310 వరకు కూలి పొందే అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రకృతి మార్పుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, జిల్లా అదనపు కలెక్టర్ సంపత్రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

