వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు!
పూల పండుగలో ఆడపడుచుల ఆటపాటలు
కోలాటం ఆడి.. డోలు వాయించిన ప్రభుత్వ విప్, కలెక్టర్
కాకతీయ, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, మహిళల ఆటపాటలు, సంప్రదాయ గీతాలతో పట్టణ పురవీధులు పండుగ శోభను సంతరించుకున్నాయి. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గీతే, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ మహిళలతో కలిసి కోలాటం ఆడుతూ, డోలు వాయిస్తూ సందడి చేశారు. బతుకమ్మ పాటలకు మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. బతుకమ్మ ఘాట్ వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆటలు ఆడారు. అనంతరం మూలవాగులో బతుకమ్మలను నిమజ్జనం చేసి, వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు వేములవాడలో కన్నులపండువగా సాగాయి.

