ప్రజా సమస్యలను పరిష్కరించాలి
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు!
తాగునీటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలి
మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్
సమీక్ష సమావేశానికి సర్పంచులు గైర్హాజరుపై ఎమ్మెల్యే ఆగ్రహం
కాకతీయ, కేసముద్రం: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ హెచ్చరించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కేసముద్రం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి కొందరు సర్పంచులు గైర్హాజరు కావడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించే సమావేశాలకు ప్రజాప్రతినిధులు బాధ్యతగా హాజరుకావాలని సూచించారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో రైతులకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని, ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని పేర్కొన్నారు.
నిర్లక్ష్య అధికారులకు నియోజకవర్గంలో స్థానం లేదు
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తున్నారని ఫిర్యాదులు తన దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులకు తన నియోజకవర్గంలో స్థానం లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ మధుసూదన్, ఎంపీడీవో క్రాంతి కుమారి, తహసీల్దార్ వివేక్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

