ఎస్సీ, ఎస్టీ కేసు విచారణలో తప్పిదాలపై ఫిర్యాదు..
సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి..
పోలీస్ కమిషనర్ శ్వేతకు జర్నలిస్టుల వినతి..
కాకతీయ, హనుమకొండ :ఎస్సీ, ఎస్టీ కేసు (ఎఫ్ఐఆర్ నంబర్ 471/2025) విచారణలో జరిగినట్లు ఆరోపిస్తున్న తప్పిదాలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జర్నలిస్టులు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతకు శనివారం ఫిర్యాదు చేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసులో తాము సాక్షులుగా ఉన్నామని జర్నలిస్టులు గడ్డం కేశవమూర్తి, తోట సుధాకర్, పెండెం వేణుమాధవ్, మేరుగుల రాజేంద్రప్రసాద్ తెలిపారు. అయితే, విచారణ అధికారిగా వ్యవహరించిన హనుమకొండ ఏసీపీ నరసింహారావుతో పాటు ఇతర పోలీసు అధికారులు ఎవరూ తమను విచారణకు పిలవలేదని, తమ నుంచి ఎలాంటి వాంగ్మూలాలు కూడా తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినప్పటికీ, 2025 ఆగస్టు 15న ఏసీపీ సమక్షంలో తాము వాంగ్మూలాలు ఇచ్చినట్లు పత్రాలు రూపొందించి, వాటిని న్యాయస్థానానికి సమర్పించి కేసును మూసివేసినట్లు తమ దృష్టికి వచ్చిందని వివరించారు. ఈ విషయంపై సంబంధిత ఏసీపీని సంప్రదించగా, కేసు మూసివేసినట్లు తెలిపారని పేర్కొన్నారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేసును ఎలా మూసివేస్తారని ప్రశ్నించగా, ఏమైనా ఉంటే కోర్టుకు వెళ్లి చూసుకోవాలని సమాధానమిచ్చినట్లు తెలిపారు. తమను విచారించకుండానే తమ పేర్లతో వాంగ్మూలాలు ఎలా నమోదు చేశారు? వాటిని ఏ ఆధారాలతో న్యాయస్థానానికి సమర్పించారు? అనే అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని వారు కోరారు. సంబంధిత పోలీసు రికార్డులు, వాంగ్మూలాలు, న్యాయస్థానానికి సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, తప్పిదాలకు బాధ్యులుగా తేలిన అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ద్వారా పొందిన పత్రాలను కూడా పోలీస్ కమిషనర్కు అందజేశారు. జర్నలిస్టుల ఫిర్యాదు, వారు సమర్పించిన పత్రాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ శ్వేత సానుకూలంగా స్పందించినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి విచారణ జరిపిస్తామని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇదే ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించి బాధితుడు కంకనాల సంతోష్ కూడా తనకు జరిగిన అన్యాయాన్ని పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. తన ఫిర్యాదుపై విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వల్లాల వెంకటరమణ, టీయూడబ్ల్యూజే హన్మకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, ప్రధాన కార్యదర్శి ఊటుకూరు సాయిరాం, కోశాధికారి పొడిచెట్టి విష్ణువర్ధన్, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర బాధ్యులు పి. వేణుమాధవ్, తోట సుధాకర్, బోళ్ల అమర్, మేరుగుల రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

