క్రీడలతోనే సంపూర్ణ మానసిక ఉల్లాసం
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపు
కాకతీయ, వర్ధన్నపేట: క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం, ప్రశాంతతను అందిస్తాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. శనివారం వర్ధన్నపేట మండలం డీసీ తండా శివారులో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్లో ఆయన క్రికెట్ ఆడి సందడి చేశారు. యువత కేరింతలతో మైదానంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి, యువతను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం తండాలు, గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఆటలకు మైదానాలు లేక ఇబ్బందులు పడిన గ్రామీణ యువతకు ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు.
రాయపర్తిలో ప్రత్యేక పూజలు
రాయపర్తి మండలం తిరుమలాయపల్లిలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం తిరుమలాయపల్లి, గణేష్కుంట తండా, శివరాంపురం, బురహన్పల్లి గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో మండల, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

