16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
కాకతీయ, వరంగల్ బ్యూరో : పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు, పర్వతగిరి పోలీసులతో కలిసి శనివారం పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పర్వతగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఏబీ తండాలో మెయినేని రాము నిర్వహిస్తున్న లక్ష్మీ పౌల్ట్రీ ఫామ్‌పై టాస్క్‌ఫోర్స్ బృందం దాడి చేసింది. ఈ తనిఖీల్లో 50 కిలోల చొప్పున 14 బస్తాల పీడీఎస్ బియ్యం, 50 కిలోల చొప్పున 4 బస్తాల పీడీఎస్ విరిగిన బియ్యం, క్వింటాలు చొప్పున మరో 7 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 16 క్వింటాళ్లు 1,600 కిలోల పీడీఎస్ బియ్యం, విలువ సుమారు రూ.56 వేలుగా పోలీసులు వెల్లడించారు. అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని నిల్వ చేసి ఉంచిన మెయినేని రామును అదుపులోకి తీసుకున్న పోలీసులు, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని తదుపరి చర్యల కోసం పర్వతగిరి పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ జి. సుబ్బారెడ్డి, ఎస్‌ఐ బి. ఉప్పలయ్యతో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు.

