వరంగల్‌ను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
గ్రామస్థాయి నుంచే అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేస్తాం
క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు
స్టేడియాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం
యువతకు శిక్షణ, ప్రోత్సాహం అందించాలి
క్రీడలతో ఆరోగ్యం.. క్రమశిక్షణ.. ఆత్మవిశ్వాసం
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
కాకతీయ, హనుమకొండ : వరంగల్‌ను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడంతోపాటు గ్రామస్థాయి నుంచే ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యమని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి సమస్యలను తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి నిధుల మంజూరుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ తెలంగాణ స్టేట్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్, ఇండియా యూత్ అండర్-18 సెలెక్షన్ ట్రయల్ క్యాంప్‌లో నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. స్టేడియాన్ని కేవలం క్రీడా మైదానంగా కాకుండా అన్ని సౌకర్యాలతో కూడిన స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేసేలా సమగ్ర రూపకల్పనతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
గ్రామస్థాయి నుంచే ప్రతిభను గుర్తించాలి
క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు గ్రామస్థాయి నుంచే ప్రతిభను గుర్తించి శిక్షణ, ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. క్రీడల ద్వారా యువతలో ఆరోగ్యకరమైన జీవన విధానంతోపాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ఎక్కువ మంది ప్రతిభావంతులు ఉన్నత స్థాయికి ఎదిగేలా కింది స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు.
విద్య, వైద్యం తర్వాత క్రీడలకు కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందని నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాలు సమన్వయంతో పనిచేస్తాయని చెప్పారు. క్రీడా రంగంలో ప్రతిభ కనబరుస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, యువత క్రీడలను భవిష్యత్తుకు బలమైన పునాదిగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యుడు కే.ఆర్.నాగరాజు, నగర పోలీస్ కమిషనర్ శ్వేత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యులు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.

