చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి పిలుపు
కాకతీయ, నల్లబెల్లి : తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వామ్య దొరల అణచివేతకు, వెట్టిచాకిరి విధానానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం నల్లబెల్లి మండల కేంద్రంలోని ఆమె విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడుతూ అణచివేత, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడిన ధైర్యానికి ఐలమ్మ పోరాటం ప్రతీకగా నిలిచిందన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఐలమ్మ చూపిన ధైర్యం, తెగువ నేటి తరాలకు ఆదర్శమన్నారు. అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ధైర్యం, హక్కుల కోసం ఐక్యంగా పోరాడే స్ఫూర్తిని ఐలమ్మ జీవితం నుంచి ప్రతి ఒక్కరూ పొందాలని పిలుపునిచ్చారు. ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.

