అతిథుల వివరాలు నమోదు చేయాలి
లాడ్జీలు, హోటళ్లలో నిబంధనల అమలు తప్పనిసరి
హనుమకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్
కాకతీయ, హన్మకొండ : లాడ్జీలు, హోటళ్ల యజమానులు, నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హనుమకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ సూచించారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు, హోటళ్ల యజమానులు, నిర్వాహకులతో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రతి అతిథి వివరాలను గెస్ట్ రిజిస్టర్‌లో నమోదు చేసి, గుర్తింపు పత్రాలను పరిశీలించిన తర్వాతే గదులు కేటాయించాలని సూచించారు. సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని, అనుమానాస్పద వ్యక్తులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. పోలీసుల తనిఖీల సమయంలో రిజిస్టర్లు, సీసీటీవీ ఫుటేజ్, ఇతర రికార్డులను అందుబాటులో ఉంచాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సహకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు సతీష్, కిషోర్ పాల్గొన్నారు.

