epaper
Wednesday, October 7, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కరెంట్‌ కోతలు.. బిల్లులతో వాతలు

కరెంట్‌ కోతలు.. బిల్లులతో వాతలు
రూ.5,420 కోట్ల భారం మోపే హక్కు ఎవరిచ్చారు
కరెంట్‌ ఇవ్వలేని ప్రభుత్వం బిల్లులు పెంచుతుందా?
కేసీఆర్‌ నిర్మించిన విద్యుత్‌ వ్యవస్థను నడపలేకపోతున్నారు
బొగ్గు, నీళ్లు ఉన్నా విద్యుత్‌ ఉత్పత్తి ఎందుకు చేయడం లేదు
ట్రాన్స్‌కో సహా విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఒకవైపు కరెంట్‌ కోతలు, మరోవైపు పెరిగిన కరెంట్‌ బిల్లులతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దసరా, దీపావళి పండుగల వేళ ప్రజలకు శుభవార్త చెప్పాల్సిన ప్రభుత్వం ట్రూ అప్‌ ఛార్జీల పేరుతో ఏకంగా రూ.5,420 కోట్ల భారాన్ని వినియోగదారులపై మోపేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. విద్యుత్‌ కొనుగోళ్లకు వెచ్చించిన మొత్తాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేయాలని నిర్ణయించడానికి రేవంత్‌రెడ్డికి హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. విద్యుత్‌ సంస్థల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలకు ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలని నిలదీశారు. ట్రూ అప్‌ ఛార్జీల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, రూ.5,420 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు.

బషీర్‌బాగ్‌ నుంచి విద్యుత్‌ ఉద్యమం వరకు

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. విద్యుత్‌ సమస్య నుంచే తెలంగాణ ఉద్యమ పోరాటం ప్రారంభమైందని గుర్తుచేశారు. బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటన జరిగి 26 ఏళ్లు పూర్తయ్యాయని, ఆ కాల్పులను చూసిన కేసీఆర్‌ కరెంట్‌ కష్టాలకు చరమగీతం పాడాలనే లక్ష్యంతో పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌ పేరుతో అర్ధరాత్రి కరెంట్‌ ఇచ్చేవారని, తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారని పేర్కొన్నారు. 24 గంటల కరెంట్‌ ఇస్తామని కేసీఆర్‌ చెప్పినప్పుడు జానారెడ్డి కూడా నమ్మలేదని, అసాధ్యంగా కనిపించిన దాన్ని కేసీఆర్‌ సుసాధ్యం చేశారని అన్నారు. కానీ ఇప్పుడు కరెంట్‌ ఉంటే వార్తగా మారే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

రూ.91 వేల కోట్లతో విద్యుత్‌ రంగం బలోపేతం

కేసీఆర్‌ ప్రభుత్వం పదేళ్లలో విద్యుత్‌ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి రూ.91 వేల కోట్లతో జెన్‌కో, ట్రాన్స్‌కో అభివృద్ధితో పాటు మౌలిక వసతులను బలోపేతం చేసిందని హరీశ్‌రావు తెలిపారు. 2014కు ముందు 6గా ఉన్న 400 కేవీ సబ్‌స్టేషన్లను 30కి, 51గా ఉన్న 220 కేవీ సబ్‌స్టేషన్లను 103కు, 176గా ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్లను 251కు పెంచామని చెప్పారు. ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్లు 233 నుంచి 384కు, ఈహెచ్‌టీ లైన్ల సర్క్యూట్‌ పొడవు 16,378 కిలోమీటర్ల నుంచి 28,131 కిలోమీటర్లకు, ట్రాన్స్‌ఫార్మర్‌ సామర్థ్యం 14,973 ఎంవీఏ నుంచి 38,941 ఎంవీఏకు పెంచామని వివరించారు. మొత్తంగా విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 19,450 మెగావాట్లకు పెంచి రాష్ట్రాన్ని పవర్‌ఫుల్‌ తెలంగాణగా నిలబెట్టామని, అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించే స్థాయికి వ్యవస్థను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.

థర్మల్‌, సోలార్‌ సామర్థ్యం పెంచాం

కొత్తగూడెంలో 800 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ను 42 నెలల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించామని, భద్రాద్రిలో 1,080 మెగావాట్ల ప్లాంట్‌ను నిర్మించామని హరీశ్‌రావు తెలిపారు. 4,000 మెగావాట్ల ఆల్ట్రా థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని, భూపాలపల్లిలో 600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఒక్క థర్మల్‌ రంగంలోనే 6,480 మెగావాట్ల సామర్థ్యాన్ని జోడించామని, సోలార్‌ విద్యుత్‌లో మరో 3,600 మెగావాట్లు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. మరోవైపు సింగరేణి ఆధారంగా 800 మెగావాట్ల విద్యుత్‌ విషయంలో రాజస్థాన్‌తో జాయింట్‌ వెంచర్‌ చేసుకున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క సబ్‌స్టేషన్‌ కూడా నిర్మించలేదని, ఒక్క మెగావాట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచలేదని విమర్శించారు.

ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్‌ కరువు

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్‌కే కరోనా పట్టినట్లుగా పరిస్థితి మారిందని హరీశ్‌రావు విమర్శించారు. ఎల్‌నినో, కరువు పేరుతో ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటోందని అన్నారు. అవకాశం ఉన్నా నీటిని వినియోగించుకోవడం లేదని, విద్యుత్‌ ఉత్పత్తి చేయడం లేదని చెప్పారు. కేసీఆర్‌ హయాంలో 24 గంటల విద్యుత్‌ సరఫరా జరిగితే ఇప్పుడు 6 గంటలు కూడా కరెంట్‌ రాని పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. దేవాదులలో 24 గంటలు మోటార్లు నడపాల్సి ఉండగా 8 గంటలే నడుపుతున్నారని, దీంతో వరంగల్‌ ప్రాంతానికి కరువు వచ్చిందని అన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టులోనూ నీటిని ఎత్తిపోయడానికి మోటార్లను 8 గంటలే నడుపుతున్నారని ఆరోపించారు. కన్నెపల్లి వద్ద నీటిని ఎత్తే విషయంలో ఎన్‌డీఎస్‌ఏను కారణంగా చూపారని, అయితే అదే సంస్థకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ తెచ్చిన కరువని వ్యాఖ్యానించారు.

బొగ్గు, నీళ్లు ఉన్నా ఉత్పత్తి ఎందుకు లేదు

భద్రాద్రి, యాదాద్రి, సింగరేణి థర్మల్‌, కేటీపీఎస్‌ వంటి విద్యుత్‌ కేంద్రాలను నిర్మించినా వాటిని నడిపించే సామర్థ్యం ప్రభుత్వానికి లేదని హరీశ్‌రావు విమర్శించారు. భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో మూడో యూనిట్‌ ఉత్పత్తి ఎందుకు నిలిచిపోయిందని ప్రశ్నించారు. 4,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ 400 మెగావాట్లు కూడా ఉత్పత్తి చేయడం లేదని అన్నారు. సింగరేణి బొగ్గు సంస్థ ఉన్నప్పటికీ సింగరేణి థర్మల్‌ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా చేయలేని పరిస్థితి ఎందుకొచ్చిందని నిలదీశారు. నదుల్లో నీళ్లు ఉన్నా రిజర్వాయర్లు నింపడం లేదని, నీటిని లిఫ్ట్‌ చేయడం లేదని, బొగ్గు ఉన్నా విద్యుత్‌ కేంద్రాలకు సరఫరా చేయడం లేదని ఆరోపించారు. రూ.1,600 కోట్ల విలువైన 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలు మాయమయ్యాయని తాము గతంలోనే హెచ్చరించామని, లేని నిల్వలను ఉన్నట్లు చూపించి పన్ను, కోల్‌ సెస్‌, సీఎస్‌ఆర్‌ చెల్లింపులు చేశారనే అంశంపై సింగరేణి ప్రాంతాల్లో తిరిగి పీపీపీ ప్రజెంటేషన్లు ఇచ్చామని తెలిపారు. బొగ్గు కుప్పలపై సేల్‌ బొగ్గు వేసి కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని, ఇప్పుడు కరెంట్‌ లేకపోవడానికి ఎల్‌నినోను కారణంగా చూపుతున్నారని విమర్శించారు.

రైతులకు మళ్లీ కరెంట్‌ కష్టాలు

ప్రభుత్వానికి పాలనపై దృష్టి కంటే ప్రతిపక్షాలపై బురదజల్లడంపైనే ఆసక్తి ఎక్కువగా ఉందని హరీశ్‌రావు అన్నారు. రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉచిత కరెంట్‌ పేటెంట్‌ కాకుండా పేషెంట్‌గా మారిందని వ్యాఖ్యానించారు. పంటను కాపాడుకునేందుకు కరెంట్‌ లేక, నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. నీ కొండారెడ్డిపల్లిలోనే రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే రేవంత్‌రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎప్పుడు కరెంట్‌ వస్తుందో తెలియక పొలాల వద్ద వేచి చూస్తున్న రైతులు పాము కాట్లకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. కరెంట్‌ కోతలు, లోఓల్టేజీతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఉమ్మడి పాలనలో చూసిన క్రాప్‌ హాలిడే, పవర్‌ హాలిడేలను మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొస్తోందని విమర్శించారు.

140 మిలియన్‌ యూనిట్ల సామర్థ్యం ఎందుకు వినియోగించడం లేదు

కేసీఆర్‌ ప్రభుత్వం రోజుకు 140 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తే ప్రస్తుతం అందులో 100 నుంచి 110 మిలియన్‌ యూనిట్లు కూడా ఉత్పత్తి చేయడం లేదని హరీశ్‌రావు అన్నారు. బొగ్గు కొరత, నీటి కొరత, నిర్వహణ లోపాలే ఇందుకు కారణమని విమర్శించారు. యాదాద్రి జనరేషన్‌ సామర్థ్యం 96 మిలియన్‌ యూనిట్లు ఉంటే 39 మిలియన్‌ యూనిట్లు కూడా దాటడం లేదని పేర్కొన్నారు. ఉన్న విద్యుత్‌ సామర్థ్యాన్ని వినియోగించుకోకుండా బయట నుంచి యూనిట్‌కు రూ.10 నుంచి రూ.12 వరకు చెల్లించి విద్యుత్‌ కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజలపై వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలోని మొత్తం థర్మల్‌ విద్యుత్‌ ఇన్‌స్టాల్డ్‌ కెపాసిటీ 13,384 మెగావాట్లు ఉంటే 8,000 మెగావాట్లు కూడా ఉత్పత్తి చేయడం లేదని, 40 నుంచి 45 శాతం గ్యాప్‌ ఎందుకొచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అధిక ధరకు బొగ్గు దిగుమతులపై ప్రశ్నలు

నైనీ బొగ్గు గనుల్లో మంచి నాణ్యత గల బొగ్గు అందుబాటులో ఉన్నప్పటికీ దాన్ని వినియోగించకుండా విదేశాల నుంచి అధిక ధరకు బొగ్గు దిగుమతి చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు చెప్పిన వ్యవహారం కుంభకోణమని తాము బయటపెట్టామని, ఈ అంశంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాసినా చర్యలు తీసుకోలేదని అన్నారు. బొగ్గు నిల్వలు చేసుకోవడంలో, రిజర్వాయర్లు నింపి థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేయడంలో, హైడల్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆ వైఫల్యాలకు ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలని ప్రశ్నించారు.

ట్రాన్స్‌కోను ప్రైవేటీకరించే ప్రయత్నం ఆపాలి

ఇవన్నీ చాలవన్నట్లు రాష్ట్ర విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌లో 26 శాతం వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుందని హరీశ్‌రావు విమర్శించారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, టీజీ-ట్రాన్స్‌కో, టీజీ-జెన్‌కో, సింగరేణి, డిస్కంల ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆరోపించారు. యాదాద్రిలో యాష్‌, కోల్‌ ప్లాంట్ల ప్రైవేటీకరణ ఇప్పటికే పూర్తయిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించొద్దని రాహుల్‌గాంధీ చెబుతున్న నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న ప్రైవేటీకరణను ఆయన అడ్డుకోవాలని కోరారు. కేసీఆర్‌ హయాంలో ప్రైవేట్‌ సంస్థలు థర్మల్‌ పవర్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నా అంగీకరించలేదని, యాదాద్రి, భద్రాద్రి, సింగరేణి ప్లాంట్లను నిర్మించి ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేశామని తెలిపారు. విద్యుత్‌ ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయాలపై పోరాటం చేయాలని, ప్రైవేటీకరణ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రజా పోరాటానికి బీఆర్‌ఎస్‌ సిద్ధం

విద్యుత్‌ రంగంలో ప్రభుత్వం చేసిన వైఫల్యాలకు ప్రజలపై ట్రూ అప్‌ ఛార్జీల పేరుతో రూ.5,420 కోట్ల భారం మోపడం సరికాదని హరీశ్‌రావు అన్నారు. కరెంట్‌ కోతలు ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమైతే, పెంచిన బిల్లుల భారం ప్రజా వ్యతిరేక విధానానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. సరిగ్గా 16 ఏళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచిన నేపథ్యంలో బషీర్‌బాగ్‌ కాల్పుల వరకు పరిస్థితి వెళ్లిందని గుర్తుచేస్తూ.. ఇప్పుడు ప్రజలపై విద్యుత్‌ భారాన్ని మోపి ఏం చేయదల్చుకున్నారని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. అప్పట్లో విద్యుత్‌ బిల్లులపై పోరాడిన కమ్యూనిస్టులు ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌ చేపట్టే పోరాటంలో కలిసి రావాలని కోరారు. రూ.5,420 కోట్ల ట్రూ అప్‌ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు. నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ప్రజా ఉద్యమానికి బీఆర్‌ఎస్‌ సిద్ధమవుతుందని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రేవంత్‌, కేసీఆర్‌ ఆస్తులపై విచారణ జరపాలి

రేవంత్‌, కేసీఆర్‌ ఆస్తులపై విచారణ జరపాలి కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ ఆరోపణలపై న్యాయ విచారణ...

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డికి బెయిల్‌

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డికి బెయిల్‌ 67 రోజుల తర్వాత జైలు నుంచి...

బోగస్‌ ఫారం–7లపై కొరడా

బోగస్‌ ఫారం–7లపై కొరడా తప్పుడు దరఖాస్తులతో ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తే చర్యలు క్షుణ్ణంగా...

పరాయి పాలన వచ్చింది!

పరాయి పాలన వచ్చింది! ప్ర‌శ్నార్థ‌కంగా తెలంగాణ అస్తిత్వం తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు తరలిపోతున్నాయి ఉద్యోగాలు మనవే.....

పదవికో రేటు.. పనికో వాటా?

పదవికో రేటు.. పనికో వాటా? వ‌రంగ‌ల్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే ప‌నితీరుపై ఆరోప‌ణ‌లు బేర‌సారాల‌తోనే...

100 శాతం పంటను కొనాలి

100 శాతం పంటను కొనాలి మద్దతు ధర ప్రకట‌న‌తో బాధ్య‌త పూర్తిన‌ట్లు కాదు వర్షాభావ...

ఇసుక లోడింగ్‌పై అద‌న‌పు బాదుడు

ఇసుక లోడింగ్‌పై అద‌న‌పు బాదుడు డీడీ కట్టినా లోడింగ్‌ పేరుతో అదనపు బాదుడు దొడ్డు...

ఆల‌స్యం త‌ప్ప‌దా..?!

ఆల‌స్యం త‌ప్ప‌దా..?! వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీకి ఇంకా బ్రేకులే ఐదేళ్లుగా సాగుతున్న భారీ నిర్మాణం భవనాలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.