రేవంత్, కేసీఆర్ ఆస్తులపై విచారణ జరపాలి
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరోపణలపై న్యాయ విచారణ అవసరం
ఎన్నికల అఫిడవిట్లలోని ఆస్తులతోపాటు అదనపు ఆస్తులపైనా దర్యాప్తు చేయాలి
ప్రజలకు వాస్తవాలు తెలియాలి
పరస్పర ఆరోపణల నిజానిజాలు నిగ్గు తేల్చాలి
బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
ఆస్తులపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పరం చేసుకుంటున్న ఆస్తుల ఆరోపణల్లో నిజానిజాలను న్యాయ విచారణ ద్వారా వెలికితీయాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదును ప్రజాప్రయోజన వ్యాజ్యంగా లేదా విచారణకు తగిన ఇతర రూపంలో స్వీకరించాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. అక్టోబర్ 2న తాను చేసిన ప్రకటనకు అనుగుణంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు అందజేశానని రఘునందన్‌రావు తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన పత్రికా కథనాలు, ఇతర వివరాలను సేకరించి, అవసరమైన పత్రాలను ఫిర్యాదుకు జతచేసినట్లు చెప్పారు. పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ వాటిపై స్వతంత్రంగా న్యాయపరమైన విచారణ కోరేందుకు ఇరు పార్టీల నేతలు ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. అందుకే తానే నేరుగా హైకోర్టును ఆశ్రయించినట్లు వివరించారు.
ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరగాలి
కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు భారీగా ఆస్తులు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారని రఘునందన్‌రావు పేర్కొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులకు భారీగా ఆస్తులు ఉన్నాయంటూ బీఆర్ఎస్ నేతలు ప్రతివిమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఇరు పార్టీల నేతలు చేస్తున్న ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ కూడా ప్రశ్నలు లేవనెత్తుతోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయలు దోచుకుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని రఘునందన్‌రావు తెలిపారు. అదే సమయంలో గత రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.50 వేల కోట్లు సంపాదించారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని చెప్పారు. ఈ రెండు వర్గాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అనేది సమగ్ర విచారణ ద్వారా తేల్చాలని కోరారు. రాజకీయ వేదికలపై పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కాకుండా వాటికి ఆధారాలను న్యాయస్థానం ముందు ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.
అఫిడవిట్లకు మించి ఆస్తులున్నాయా?
రేవంత్‌రెడ్డి, కేసీఆర్ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తులను పరిశీలించాలని రఘునందన్‌రావు కోరారు. ఆస్తుల వివరాలతోపాటు అఫిడవిట్లలో పేర్కొన్న వాటికి మించి ఇతర ఆస్తులు ఉన్నాయా అనే అంశాన్ని కూడా విచారణలో పరిశీలించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమా కాదా అన్నది న్యాయ విచారణ ద్వారానే తేలాలని అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆస్తుల వ్యవహారంపై రాజకీయ ఆరోపణలకు ముగింపు పలికి, సమగ్ర విచారణ ద్వారా వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని రఘునందన్‌రావు కోరారు.

