విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలి: సీఎండీ వరుణ్‌రెడ్డి
గీసుగొండ సబ్‌స్టేషన్లు, ఉకల్ టెక్స్‌టైల్ పార్క్‌లో పర్యవేక్షణ
కాకతీయ, గీసుగొండ: వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం గీసుగొండ 33/11 కేవీ, 132 కేవీ సబ్‌స్టేషన్లతో పాటు ఉకల్ టెక్స్‌టైల్ పార్క్‌ను సందర్శించి తనిఖీ చేశారు. సబ్‌స్టేషన్లలో విద్యుత్ సరఫరా పరిస్థితి, పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల లోడ్, 33 కేవీ ఫీడర్ల లోడింగ్, వోల్టేజ్ స్థాయిలు, పవర్ ఫ్యాక్టర్, ట్రాన్స్‌ఫార్మర్ల ట్యాప్ పొజిషన్లను పరిశీలించారు. ప్రస్తుత విద్యుత్ డిమాండ్‌తో పాటు రానున్న వేసవిలో పెరగనున్న గరిష్ఠ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అధిక లోడ్ ఉన్న ఫీడర్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి లోడ్ బ్యాలెన్సింగ్, ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్య పెంపు, అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వంటి చర్యలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ పరికరాలు, బ్రేకర్లు, రిలేలు, రక్షణ వ్యవస్థలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం ఉకల్ టెక్స్‌టైల్ పార్క్‌ను సందర్శించిన సీఎండీ అక్కడి పారిశ్రామిక కార్యకలాపాలు, ప్రస్తుత విద్యుత్ అవసరాలు, భవిష్యత్ డిమాండ్‌పై అధికారులతో సమీక్షించారు. పరిశ్రమల విస్తరణకు అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతులను ముందుగానే బలోపేతం చేయాలని, సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు, ఫీడర్, సబ్‌స్టేషన్ సామర్థ్యాలను పరిశీలించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సీఎండీ వెంట వరంగల్ ఎస్‌ఈ ఏ. ఆనందం, వరంగల్ రూరల్ డీఈ దానయ్య, ఏడీఈ రవి, ఇంజినీరింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.

