లారీ బీభత్సం
డీసీఎం, కారును ఢీకొట్టిన లారీ
సీఆర్పీఎఫ్ జవాన్ మృతి, మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
పస్ర చెక్‌పోస్ట్ వద్ద ఘటన
కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా గోవిందరావుపేట మండల పరిధిలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పస్ర చెక్‌పోస్ట్ సమీపంలోని జాతీయ రహదారి-163పై సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న డీసీఎం వాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 39వ బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు జవాన్లకు, ప్రైవైట్ కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, పోలిసుల కథనం మేరకు..ఏటూరునాగారం నుంచి ములుగు వైపు నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు డీసీఎం వాహనంలో వెళ్తున్నారు. పస్ర వైపు నుండి ఏటూరునాగారం వైపు వస్తున్న లారీ పస్ర చెక్‌పోస్ట్ సమీపంలో డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద ధాటికి డీసీఎం అదుపుతప్పి రహదారి పక్కనున్న అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో లారీ మరో ప్రైవేట్ కారు కూడా ఢీకొనడంతో కారు లారీ కిందకు దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో డీసీఏం లో ప్రయాణిస్తున్న జవాన్లు గిరీష్‌కుమార్, ప్రేమ్‌ప్రకాశ్, రంజాన్‌ప్రసాద్ (50) తీవ్రంగా గాయాపడగా ముగరం రమాకాంత్(35) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తాడ్వాయి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ ఉద్యోగి పి.రమేశ్, గోవిందరావుపేట మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పనిచేస్తున్న సఫ్జియాకు కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



