ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు
13నుంచి సమ్మెకు దిగుతున్న ఉద్యోగులకు అండగా ఉంటాం
జీతాలు పెంచి ఇన్క్రిమెంట్లు ఇవ్వాలి
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
17 వేల మంది సేవలను ప్రభుత్వం గుర్తించాలి
మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఎన్హెచ్ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఈ నెల 13 నుంచి ఉద్యోగులు చేపట్టనున్న సమ్మెకు బీఆర్ఎస్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు జీతాలు పెంచి తగిన ఇన్క్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎన్హెచ్ఎంలో సుమారు 17 వేల మంది ఉద్యోగులు వివిధ విభాగాల్లో పనిచేస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని వినోద్‌కుమార్ తెలిపారు. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఇతర సిబ్బంది ప్రజారోగ్య వ్యవస్థలో కీలకంగా పనిచేస్తున్నారని అన్నారు.
ఇన్సూరెన్స్‌తో కుటుంబాలకు భరోసా
ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు వెంటనే కల్పించాలని కోరారు. విధి నిర్వహణలో ప్రమాదం జరిగినా, అనారోగ్యానికి గురైనా, ఉద్యోగి మరణించినా వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలవుతున్న ఎన్హెచ్ఎంలో ఇతర రాష్ట్రాల్లో తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే ఉద్యోగుల ప్రతినిధులతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రెసిడెంట్ డా. మహేందర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ డా. భరత్, జనరల్ సెక్రటరీ ఎండీ రుకముద్దీన్, కార్యవర్గ సభ్యులు నరేష్, వినోద్ తదితరులు వినతిపత్రం అందజేశారు.

