గోదావరిలో పడి బాలుడి మృతి
బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదం
పూసూరులో విషాదం
ఆరేళ్ల చిన్నారి మృతితో కన్నీరుమున్నీరైన కుటుంబం
కాకతీయ, ఏటూరునాగారం : గోదావరిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం పూసూరు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి హేశ్వంత్ (6) బహిర్భూమికి వెళ్లేందుకు మరో బాలుడితో కలిసి గోదావరి ఒడ్డుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నదిలో జారిపడి నీట మునిగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. హేశ్వంత్ పూసూరు గ్రామంలోని పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆరేళ్ల బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై వాజేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

