కోఆప్షన్ ఎన్నికలకు ఎందుకింత భయం?
బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్నందుకే వాయిదా
ఎన్నికై ఏడాది అవుతున్నా కోఆప్షన్ సభ్యుల ఊసేది?
కేసీఆర్ భూముల పేరుతో ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ యత్నం
రైతులు రేవంత్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజం
కాకతీయ, తొర్రూరు : మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్నారనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కోఆప్షన్ ఎన్నికలను వాయిదా వేస్తోందని ఆరోపించారు. ఎన్నికై ఏడాది కావస్తున్నా కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు నిర్వహించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కౌన్సిలర్ల హక్కులను ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. తొర్రూరులోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడారు. ప్రతి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్నందున కోఆప్షన్ పదవులు తమ పార్టీకి దక్కుతాయనే భయంతోనే ప్రభుత్వం ఎన్నికలను ముందుకు సాగనివ్వడం లేదని అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు చైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉందనే కారణంతోనే ఎన్నికల ప్రక్రియను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
భూకబ్జాల పేరుతో కొత్త నాటకం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భూముల అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఎర్రబెల్లి విమర్శించారు. కేసీఆర్ భూకబ్జాల పేరుతో కొత్త నాటకానికి తెరలేపుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన అన్నదమ్ములకు వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఎర్రబెల్లి అన్నారు. రైతుబంధు, యూరియా కొరత, విద్యుత్ సరఫరా, పంట రుణమాఫీ తదితర అంశాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతు బీమా ప్రీమియం చెల్లింపునకు గడువు ముగిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, సాగునీరు అందించడంలోనూ నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.
సంక్షేమ పథకాలు కొనసాగించాలి
కేసీఆర్ హయాంలో రైతులు, మహిళల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలను కొనసాగించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించడంతోపాటు కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామన్న హామీని అమలు చేయాలని కోరారు. సంక్షేమ పథకాలను నిలిపివేస్తే మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మున్సిపాలిటీల్లో కోఆప్షన్ ఎన్నికలను ఇకనైనా వెంటనే నిర్వహించి, ఎన్నికైన కౌన్సిలర్లకు వారి హక్కులు కల్పించాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తే బీఆర్ఎస్ తరఫున ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పసుమర్తి సీతారాములు, మంగళపల్లి శ్రీనివాస్, రామిని శ్రీనివాస్, నల్లమాస ప్రమోద్‌కుమార్, హనుమండ్ల ప్రదీప్‌రెడ్డి, కుర్ర శ్రీనివాస్, మనిరాజు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు భూసాని జయమ్మ, ధరావత్ పద్మ, కిన్నెర కవిత, తూర్పటి రవి, జంపా, మాడుగుల భవానీలత తదితరులు పాల్గొన్నారు.

