మిల్క్ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి
కాకతీయ, వరంగల్ బ్యూరో/వరంగల్ ప్రతినిధి : అనుమతులు లేకుండా, అపరిశుభ్ర పరిస్థితుల్లో పాల ఉత్పత్తులు విక్రయిస్తున్నారనే సమాచారంతో వరంగల్ నగరంలోని చార్‌బౌలిలో ఉన్న వారంగల్ మిల్క్ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ తనిఖీల్లో రూ.1,29,065 విలువైన నెయ్యి, ఖోవా, మలై, బ్రెడ్ తదితర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మిల్క్ సెంటర్ నిర్వాహకుడు విరాణి మురాద్ (తండ్రి మన్సూర్ అలీ)ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ అనుమతులు, అవసరమైన లైసెన్సులు లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు, ఉత్పత్తుల నిల్వ, పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాల విషయంలో నిబంధనలు పాటించనట్లు పోలీసులు గుర్తించారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో ఆహార పదార్థాలను నిల్వ చేసి విక్రయించడం ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉందని తెలిపారు. దాడిలో 15 కిలోల చొప్పున ఉన్న 6 నెయ్యి డబ్బాలతో పాటు వివిధ పరిమాణాల్లోని నెయ్యి ప్యాకెట్లు, బకెట్లు, ఖోవా, మలై ప్యాకెట్లు, 39 బ్రెడ్ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం నిర్వాహకుడితో పాటు స్వాధీనం చేసుకున్న ఉత్పత్తులను వరంగల్ జిల్లా ఆహార భద్రతాధికారులకు అప్పగించారు. దాడిలో ఏసీపీ ఏ. మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ జి. శుభారెడ్డి, ఎస్‌ఐ బి. ఉప్పలయ్య, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

