ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు.. బాలిక బలవన్మరణం
ఫోన్‌కాల్స్, ఇన్‌స్టాగ్రామ్ సందేశాలతో వేధింపులు
హెచ్చరించినా మారని యువకుడి తీరు
కాకతీయ, చందుర్తి: ప్రేమ పేరుతో యువకుడు వేధిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటకు చెందిన 15 ఏళ్ల పదో తరగతి విద్యార్థిని ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. రుద్రంగి మండలానికి చెందిన యువకుడు ఫోన్‌కాల్స్, ఇన్‌స్టాగ్రామ్ సందేశాల ద్వారా తరచూ వేధించేవాడని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెలలోనే యువకుడిని హెచ్చరించినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదులో తెలిపారు. ఈ ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి సీఐ రవీందర్ వెల్లడించారు.

