కాజీపేటకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు
పరిపాలనాపరమైన అనుమతులు జారీ
ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధనకు అవకాశం
కాకతీయ, కాజీపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాజీపేటకు మంజూరైంది. ఈ మేరకు ఈ నెల 9వ తేదీన విద్యాశాఖ పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట మండల కేంద్రం విద్యానగర్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించింది. ఈ పాఠశాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు కల్పించనున్నారు. అధునాతన తరగతి గదులతో పాటు గ్రంథాలయం, కంప్యూటర్ ప్రయోగశాలలు, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు, భోజనశాలలు, ఆధునిక క్రీడా వసతులతో కూడిన మైదానాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన అందించనున్న ఈ పాఠశాలలో సుమారు 1,500 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంది. దీంతో కాజీపేట ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడంపై బీసీ టీచర్స్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి బీసీ టీచర్స్ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాజీపేటలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కావడంతో ఈ ప్రాంత ప్రజలు ఏళ్ల తరబడి కోరుకుంటున్న జూనియర్ కళాశాల అవసరం కూడా తీరే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒకే పాఠశాలలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసించే అవకాశం కలగడం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.


