కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం
కరువు పరిస్థితులపై ముందస్తు చర్యలు ఏవీ
సాగునీరు, విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలం
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్
కాకతీయ, ఖమ్మం: కాంగ్రెస్ అసమర్థ పాలనతో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కరువు పరిస్థితులు, సాగునీరు, విద్యుత్ కొరతతో అన్నదాతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి అత్యవసర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎల్నినో ప్రభావంపై గత 9 నెలలుగా ప్రపంచ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేసిందని పువ్వాడ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ రైతులకు అవసరమైన సాగునీరు, విద్యుత్ అందించలేని పరిస్థితి నెలకొందని, ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. సాగునీరు, విద్యుత్ సరఫరాను మెరుగుపరిచి రైతులను ఆదుకోవాలని కోరారు. సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ఇదే వైఖరి కొనసాగిస్తే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

