నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఏకనామ స్మరణ
‘ఓం నమో సుబ్రహ్మణ్యం’ నామస్మరణతో మార్మోగిన దేవాలయ ప్రాంగణం
కాకతీయ, గీసుగొండ : ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మాలధారణ చేసిన స్వాములు ఏకనామ స్మరణ చేశారు. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం మండల దీక్ష చేపట్టిన స్వాములు ‘ఓం నమో సుబ్రహ్మణ్యం’ అంటూ ఏకనామ స్మరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు ఉదయాన్నే స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి, చతుర్వేద పారాయణంతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ మండల దీక్ష చేపట్టిన స్వాములు రోజంతా ‘ఓం నమో సుబ్రహ్మణ్యం’ అంటూ స్వామివారి ఏకనామ స్మరణలో పాల్గొంటారని తెలిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

