పెద్దాపూర్‌కు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు
రూ.9.95 కోట్ల నిధుల కేటాయింపు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి సర్పంచ్ ఎలుకటి రవి కృతజ్ఞతలు
కాకతీయ, ఆత్మకూరు: పెద్దాపూర్ గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.9.95 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ పాఠశాల మంజూరైందని గ్రామ సర్పంచ్ ఎలుకటి రవి తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో పెద్దాపూర్‌తో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆధునిక విద్యా సదుపాయాలతో పాఠశాల అందుబాటులోకి వస్తే గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దాపూర్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి గ్రామ ప్రజల తరఫున సర్పంచ్ ఎలుకటి రవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

