విద్యుత్ కోతలపై బీఆర్ఎస్ రాస్తారోకో
రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలి
కోతలతో ఎండిపోతున్న పంటలు
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య ఆధ్వర్యంలో నిరసన
కాకతీయ, పెద్దవంగర: వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డేకొత్తపల్లి గ్రామ శివారులోని ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం కనీసం 5 నుంచి 6 గంటల పాటు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదని విమర్శించారు. విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సరైన సమయంలో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, పొలాల్లో భూమి బీటలు వారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ, సుధీర్, సంజయ్, భాస్కర్, సుధాకర్, వెంకన్న, పటేల్ నాయక్, కవిత యాకన్న, రాము, వెంకట్రెడ్డి, శంకర్, యాకన్న, రవి, సమ్మయ్య, పూర్ణచందర్, గంగాధర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

