పట్టభద్రుల ఓటు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
అర్హులైన పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు కావాలి
ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు పిలుపు
కాకతీయ, ములుగు : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని అర్హులైన పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు పిలుపునిచ్చారు. గతంలో ఓటు ఉన్నవారు సైతం నిబంధనల ప్రకారం ఫారం–18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ ధ్రువపత్రాన్ని జతచేసి ఫారం–18ను తహసీల్దార్ లేదా ఆర్డీవో కార్యాలయాల్లో సమర్పించవచ్చని, ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. దరఖాస్తులో ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. నవంబర్ 6 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అని, నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితా, డిసెంబర్ 30న తుది జాబితా ప్రకటించనున్నట్లు వివరించారు. అర్హులైన పట్టభద్రులు గడువులోగా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామాలు, మండలాల వారీగా పట్టభద్రులను చైతన్యపరిచి ఓటు నమోదు ప్రక్రియలో సహకరించాలని లక్ష్మణ్‌బాబు సూచించారు.

