పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి..
నిందితుల అరెస్టుపై ప్రత్యేక దృష్టి సారించాలి..
బతుకమ్మ, దసరా పండుగలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి..
కాకతీయ, వరంగల్ బ్యూరో : పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులను త్వరితగతిన అరెస్టు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారులు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు కేసుల స్థితిగతులపై సమీక్షించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కేసుల దర్యాప్తులో జాప్యం జరగకుండా నాణ్యతతో కూడిన విచారణను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారులపై నేరాలు, ఆస్తి నేరాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల కేసులు, తీవ్రమైన నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి కేసులో చట్ట నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. రానున్న బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత, అదనపు డీసీపీలు రాయల ప్రభాకర్ రావు, హనుమకొండ ఏసీపీ నరసింహారావు, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, పలువురు సీఐలు, ఎస్సైలు, ఐటీ కోర్ అధికారులు పాల్గొన్నారు.

