18 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వైద్య సేవలు
పెనుగోలు కొండపై వైద్య శిబిరం
ఇద్దరికి మలేరియా పాజిటివ్గా నిర్ధారణ
మారుమూల గిరిజనులకు వైద్య సిబ్బంది సేవలు
కాకతీయ, ఏటూరునాగారం : మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రత్యేక చొరవ చూపారు. వాజేడు మండలంలోని పెనుగోలు కొండపై వైద్య శిబిరం నిర్వహించేందుకు గుమ్మడిదొడ్డి గ్రామం నుంచి సుమారు 18 కిలోమీటర్లు దట్టమైన అటవీ మార్గంలో కాలినడకన ప్రయాణించారు. వాహనాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో రాకపోకలకు కలిపి 36 కిలోమీటర్లు నడిచి గిరిజనులకు వైద్య సేవలు అందించారు. పెనుగోలు కొండపై 10 ఇళ్లు, 36 మంది జనాభా ఉండగా, 25 మందికి మలేరియా పరీక్షలు నిర్వహించారు. వీరిలో బొగ్గుల సత్యం (42), ఉయిక రాధ (45)కు మలేరియా పాజిటివ్గా నిర్ధారణైంది. వైద్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు గ్రామంలోని ఇళ్లలో మలేరియా నివారణ మందులను పిచికారీ చేశారు. అలాగే ప్రతి కుటుంబానికి ఒక దుప్పటిని కే. శ్రీనివాసరావు తన సొంత ఖర్చులతో అందజేశారు. ఈ శిబిరంలో కే. శ్రీనివాసరావు, కే. చిన్న వెంకటేశ్, కే. శేఖర్, బి. లఖన్ పాల్గొనగా, బుంజగరావు, హిమామ్ సహకరించారు. మారుమూల ప్రాంతాల్లోనూ వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది చూపిన చొరవపై ఏజెన్సీ వాసులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

