చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పిలుపు
రాష్ట్రస్థాయి టెన్నిస్ పోటీలకు ఘనంగా శ్రీకారం
కాకతీయ, హనుమకొండ: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని జేఎన్ఎస్ స్టేడియంలో గురువారం 70వ తెలంగాణ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య లాన్ టెన్నిస్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ను ప్రారంభించారు. ఎమ్మెల్యేలు టెన్నిస్ రాకెట్లు పట్టి కోర్టులో ఆడటంతో క్రీడాకారుల్లో ఉత్సాహం నెలకొంది. నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ చిన్న వయసు నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకుని క్రమం తప్పకుండా సాధన చేయాలని సూచించారు. ప్రతిభతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. కేఆర్ నాగరాజు మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. హనుమకొండలో టెన్నిస్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సమయపాలన, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు. అక్టోబర్ 15 నుంచి 17 వరకు జరిగే పోటీల్లో అండర్-17, అండర్-19 బాలబాలికలు పాల్గొంటున్నారు. ప్రతిభ చూపినవారిని తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్, క్రీడా అధికారులు, టెన్నిస్ అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

